మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
విద్యా సంస్థలలో యాంటి డ్రగ్స్ పై వ్యాస రచన పోటీల నిర్వహణ
గ్రామాలలో గంజాయి పై సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి
మాదక ద్రవ్యాల పై జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్
రాజన్న సిరిసిల్ల/జిల్లా స్టాఫ్ రిపోర్టర్/ ముస్తాబాద్ (వాయిస్ న్యూస్) డిసెంబర్-18:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహజాన్ తో కలిసి సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు.
జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, గ్రామస్థాయి నుంచి డ్రగ్స్, గంజాయి సమస్య పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. డ్రగ్స్ గురించి ఫీల్డ్ లెవల్ నుంచి సమాచారం అందాలని, ప్రతి గ్రామం నుంచి పంచాయతీ కార్యదర్శి గంజాయి సమస్య పరిష్కారం పై సమాచారం అందించాలని, గ్రామంలో ఎవరు గంజాయి కి బానిసలు అవుతున్నారు మొదల వివరాలు అందించాలని కలెక్టర్ తెలిపారు.
గంజాయి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని, మీ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో డ్రగ్స్, గంజాయి నివారణ పై వ్యాస రచన పోటీలు, పేయింటింగ్ పోటీలు ప్రతి నెలా నిర్వహించాలని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలో సంబంధిత శాఖ అధికారులను పక్కా కార్యాచరణతో కృషి చేయాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా బెల్ట్ షాపు లు ఉంటే జిల్లా ఎక్సైజ్ అధికారి 8712658827 నెంబర్ కు సమాచారం అందించాలని, బెల్ట్ షాపులను తొలగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
విద్యా సంస్థల్లో నిర్వహించే పేరెంట్ టీచర్స్ సమావేశాలలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారితే వచ్చే పరిణామాలు, మాదకద్రవ్యాల బానిసత్వం నివారణకు ప్రభుత్వం సిరిసిల్ల రాజీవ్ నగర్ బస్తీ దవఖానలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ మొదలగు అంశాలను వివరించాలని, పేరెంట్స్ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందజేయాలని కలెక్టర్ సూచించారు.
డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాల పై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎస్పీ అఖిల్ మహజాన్ మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ మాదకద్రవ్యాల నియంత్రణకు పక్కా నిఘా ఏర్పాటు చేశామని, గత సంవత్సర కాలంగా మాదకద్రవ్యాలకు సంబంధించి 95 కేసులో నమోదు చేసి దీనికి సంబంధించిన 214 పైగా వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
డ్రగ్స్ నివారణ కోసం సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు .మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్, గుడెంబా సంబంధించి పౌరులకు ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656426 కు తెలియజేయాలని , సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి డ్రగ్స్, గంజాయి అలవాటు ఉన్నట్లు ఏదైనా అనుమానం కలిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని, మా దగ్గర అవసరమైన మేర డ్రగ్స్ నిర్దారణ కిట్లు, నార్కోటిక్స్ గుర్తించే డాగ్స్ అందుబాటులో ఉన్నాయని వెంటనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్.డి.ఓ. సిరిసిల్ల వెంకట ఉపేందర్ రెడ్డి, ఇన్చార్జి డి.పి.ఓ. శేషాద్రి, డి.ఏ.ఓ. అఫ్జలి బేగం, డి.ఐ.ఈ.ఓ. శ్రీనివాస్, జిల్లా ఎక్సైజ్ అధికారి పంచాక్షరి, విద్యా అధికారులు తదితరులు పాల్గొన్నారు.