తెలంగాణలో బిజెపికి నూతన అధ్యక్షులు…?
తెలంగాణలో 15-20 జిల్లాలకు నూతన అధ్యక్షులు
పెద్దపల్లి జిల్లా బీజేపీకి సైతం కొత్త అధ్యక్షుడు..!
-పరిశీలనలో యువనేత అమరగాని ప్రదీప్ కుమార్
కరీంనగర్ ( వాయిస్ న్యూస్ ) జనవరి 18
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15నుండి 20 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలో ప్రస్తుత పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని పై సైతం ఏకపక్ష నిర్ణయాలతో ఆయన పనితీరు సరిగా లేదని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇక్కడ కూడా అధ్యక్షుని మార్చాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో క్యాడర్లో ఉత్సాహం నింపాలంటే యువతకే జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 8 సీట్లు గెలుచుకొని కొత్త ఉత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షంగా పార్టీ కార్యక్రమాలు విరివిగా చేపడుతూ ముందుకెళుతుంటే పెద్దపల్లి జిల్లాలో మాత్రం గ్రూపులుగా విడిపోయి నాయకుల మధ్య సమన్వయం కొరవడి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారయ్యింది. చొరవ తీసుకొని నాయకత్వం వహించి ముందుకు నడపాల్సిన జిల్లా అధ్యక్షుడే వర్గ పోరుకు ఆజ్యం పోసేలా ఏకపక్షంగా వ్యవహారిస్తుండడం తో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. ఈక్రమంలో పలువురి పేర్లు అధిష్టానం దృష్టికి రాగా పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అమరగాని ప్రదీప్ కుమార్ పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో ఢీ అంటే ఢీ అనేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ఉరకలెత్తించేలా చురుగ్గా కార్యక్రమాలు చేపట్టాలంటే సంఘ పరివార్ నేపథ్యంతో పాటు విద్యార్థి యువజన సంఘాల నాయకత్వం వహించిన అనుభవం ఉన్న అమరగాని ప్రదీప్ కుమార్ పేరును జిల్లా అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకి చెందిన రాష్ట్ర నాయకులు, సంఘ్ పెద్దలు కూడా ప్రదీప్ పేరును సూచించారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీమతి అమరగాని మమత జూలపల్లి మేజర్ గ్రామపంచాయతీ ఎంపీటీసీగా, మహిళా ఎంపీటీసీల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రదీప్ కుమార్ చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వివిధ స్థాయిలో పనిచేసి, ఆర్ఎస్ఎస్ లో ముఖ్యమైన శిక్షణలు పూర్తి చేసి సంఘ్ సిద్ధాంతం పట్ల కమిట్మెంట్ తో, ఏబీవీపీలో సైతం జిల్లా స్థాయిలో విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించిన అనుభవం ఉండడం కలిసొచ్చే అంశం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైతం జైలు జీవితం గడిపి యువజన సంఘాలను ఏర్పాటు చేసి రాష్ట్ర యువజన సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేస్తూనే, ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున యువతతో విస్తృత సంబంధాలు కలిగి ఉండడం సంఘ్ పరివార్ నేపథ్యం సంఘ్ పెద్దలు పార్టీ రాష్ట్ర జాతీయ నేతల ఆశీస్సులు సైతం ప్రదీప్ కు మెండుగా ఉండడంతో అధ్యక్షుని ఎంపికకు అనుకూల అంశాలుగా ఉన్నాయని తెలుస్తోంది. యువకుడు కావడం, చక్కటి వాగ్దాటి కలిగి ఉండి, ప్రజా సమస్యలపై బలంగా గొంతు వినిపించడమే కాకుండా కార్యకర్తలకు అండగా నిలబడి వారి మనోభావాలకు అద్దంపట్టేలా క్షేత్రస్థాయిలో పోరాట పటిమతో చురుగ్గా ఉద్యమాలు నిర్వహించే దూకుడు స్వభావం ఉండడంతో అమరగాని ప్రదీప్ కుమార్ ను అధ్యక్షుడిగా నియమిస్తే జిల్లావ్యాప్తంగా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా పెద్దపల్లి జిల్లాలో బీజేపీ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిందని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర పార్టీ పెద్దపెల్లి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి కార్యకర్తలను అందర్నీ సమన్వయపరిచి, ఏకతాటిపైకి తెచ్చి బూత్ లెవెల్లో పార్టీని నిర్మానం చేసి జిల్లాలో బలమైన శక్తిగా తీర్చిదిద్దే కెపాసిటీ ఉన్న అమరగాని ప్రదీప్ లాంటి యువకుడికి జిల్లా అధ్యక్ష పదవి అప్పగిస్తేనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు